“గడప గడపకు మన ప్రభుత్వం.. కార్యక్రమాన్ని చాలా మంది ఎలా నిర్వహించారోనాకు తెలుసు. మీరు యాక్టివ్‌గా లేకపోతే కష్టం. కనీసం `సామాజిక న్యాయ యాత్ర`లనైనా జోరుగా ముందుకు నడిపించండి. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ఉన్న ఆయుధాలు అన్నింటినీ ప్రయోగించండి“- ఇదీ.. గత నెల 18న వైసీపీ అధినేత, సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కు చేసిన దిశానిర్దేశం. ఆ వెంటనే రెండు మూడు రోజుల గ్యాప్‌లో సీఎం జగన్ సామాజిక న్యాయ యాత్రలకు శ్రీకారం చుట్టారు. తన సొంత జిల్లా కడపలో చేపట్టిన యాత్రకు ఆయన ఇక్కడ నుంచే పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
అప్పటి నుంచి మొత్తం మూడు దశల్లో సామాజిక న్యాయ బస్సు యాత్రలు చేపట్టాలని సీఎం జగన్ ఒక రోడ్ మ్యాప్‌ను కూడా ఇచ్చారు. ఈ యాత్రల ఉద్దేశం.. ప్రధానంగా టీడీపీ చేస్తున్న “బాబు భరోసా-భవిష్యత్తుకు గ్యారెంటీ“ యాత్రలకు కౌంటర్ ఇవ్వడమే. చంద్రబాబు అరెస్టుతో ఆయాత్రలు ఎలానూ ఆగిపోయాయి. దీంతో సామాజిక న్యాయ యాత్రల ద్వారా.. ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వారికి చేసిన మేళ్లను వివరించి.. వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించి తమవైపు తిప్పుకోవాలన్నదే ఈ యాత్రల ప్రధాన వ్యూహం.
ఇంతవరకు బాగానే ఉంది. యాత్రలు కూడా సజావుగానే ప్రారంభమయ్యాయి. కానీ.. రెండు మూడు రోజుల తర్వాత.. అసలు సమస్యలు వచ్చాయి. యాత్రలకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలనే విషయంపై పార్టీలో చర్చకు వచ్చింది. స్థానికంగా యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలే భరించాలని మంత్రులు తేల్చి చెప్పారు. దీనికి తొలుత అంగీకరించిన ఎమ్మెల్యేలు.. ఈ భారాన్ని స్థానిక సంస్థలనాయకులపై నెట్టారు. దీంతో వారు చేతులు ఎత్తేశారు. ముఖ్యంగా గ్రామీణస్థాయిలో అయితే, సర్పంచులు ఈ యాత్రలకు నిధులు ఇవ్వలేం. ఖర్చులు భరించలేం అని తేల్చి చెప్పేశారు.
పైగా.. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, పదువులు రానివారు.. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహంతో ఉన్నవారు ఈ యాత్రలకు దూరంగా ఉంటున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో స్థానిక వైసీపీ నాయకులు హాజరు కాకుండానే యాత్రలు జరిగిపోతున్నాయి. పైగా.. ప్రజలను మళ్లించే నాయకులు కూడా లేకపోవడంతో ముఖ్యనేతలు.. ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మంత్రి బొత్స పాల్గొన్న ఈ యాత్రలో కేవలం డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ మహిళలే కనిపించడం..పార్టీలో చర్చకు దారితీసింది. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం జగన్ ఇదే విషయాన్ని ప్రస్తావించి.. యాత్రలు ఎందుకు సక్సెస్ కావడం లేదని నిలదీసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం.