2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటి చేసింది కాబట్టి అప్పుడు చంద్రబాబును విమర్శించాం. ఈ సారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది కాబట్టి ఇప్పుడు బాబు గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. కానీ ఈ వయసులో ఆయన్ని జైల్లో పెట్టడం బాధగా ఉంది. అయ్యో పాపం అనిపిస్తోంది.. ఇవీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. మానవీయ కోణంలో తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కూడా కేటీఆర్ చెప్పారు. అంతా బాగానే ఉంది సరే. కానీ ఇంత మానవీయ కోణం ఉన్నప్పుడు కాసాని జ్ణానేశ్వర్ రావుతో చంద్రబాబును ఎందుకు తిట్టించారని కేటీఆర్, కేసీఆర్ పై విమర్శలు వస్తున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రిమాండ్ మీద 50 రోజులుకు పైగా జైల్లో గడిపారు. ఇటీవల అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే బాబు జైల్లోకి వెళ్లినప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు ఆయన అరెస్టును వ్యతిరేకించాయి. కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ బాబు అరెస్టుపై వెంటనే స్పందించలేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన తర్వాత ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసం నేరుగా కేసీఆర్ కాకుండా పార్టీ నాయకులతో మాట్లాడించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఓట్ల కోసమేన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. దీంతో టీడీపీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే కేటీఆర్ వ్యాఖ్యలనే టాక్ వినిపిస్తోంది.
బాబుపై అంతగా అభిమానం ఉంటే టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన కాసాని జ్ణానేశ్వర్ రావుతో ఎందుకు తిట్టించారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కాసాని.. ఇక్కడ ఆ పార్టీ పోటికి దూరంగా ఉండాలని బాబు నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. వెళ్లే ముందు బాబు, లోకేష్ పై కాసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకు అని కాసాని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ కోసం 20 సార్లకు పైగా ఫోన్ చేసినా లోకేష్ స్పందించలేదని, ఇది మంచి పద్ధతి కాదని కాసాని ఆరోపించారు. లోకేష్ చిన్నపిల్లవాడో, పెద్దవాడో అర్థం కాని పరిస్థితి అని కాసాని విమర్శించారు. తెలంగాణలో ఫైట్ చేయాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పోటీ చేయకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని కాసాని అసహనం వ్యక్తం చేశారు.