పుండు మీద కారం చల్లినట్లుగా ఉంటున్నాయి ఏపీ ప్రభుత్వ సలహాదారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి. రాజకీయ నేతలకు ఉండాల్సిన కనీస తెలివి కూడా లేనట్లుగా సజ్జల తీరు ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వానికి.. పార్టీకి నష్టం వాటిల్లేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయని.. మాట్లాడే ముందు తాను మాట్లాడే మాటలు ఏమిటన్న విషయంపై ఆయనకు సోయి ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
స్కిల్ స్కాం ఆరోపణలతో జైలుకు వెళ్లిన ఏపీ విపక్ష నేత చంద్రబాబు.. 52 రోజులు రాజమహేంద్రవరం జైల్లో ఉండటం.. హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ వేళ.. టీడీపీ కార్యకర్తలు.. నేతలు చేస్తున్న హడావుడిపై విరుచుకుపడటం విస్మయానికి గురవుతున్నారు.
చంద్రబాబుకు న్యాయస్థానం ఇచ్చింది షరతులతో కూడిన బెయిల్. దీన్ని ఎవరూ కాదనరు. అయితే.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘చంద్రబాబుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే.. విజయోత్సవాలు.. ర్యాలీలు ఎందుకు? ఆయనకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు కండీషనల్ బెయిల్ ఇచ్చింది. చికిత్స తర్వాత మళ్లీ జైలుకే వెళ్లాలి. ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసిన కేసులో చంద్రబాబుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మాత్రమే వచ్చింది’ అని పేర్కొన్నారు.
రోగిగా జైలు నుంచి బయటకు వస్తున్నారా? లేదంటే.. ఏమైనా యుద్ధంలో గెలిచి వీర యోధుడిగా వస్తున్నాడని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. కంటి చికిత్స కోసం నాలుగు వారాలు తాత్కాలిక బెయిల్ పై చంద్రబాబు బయటకు వచ్చారని.. చికిత్స తర్వాత నవంబరు 28న సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సిందేనని సజ్జల పేర్కొన్నారు. ఈ మాత్రానికే రాజమండ్రి నుంచి రోడ్ షో నిర్వహించుకోవటానికి.. సంబరాలు చేసుకోవటానికి సిగ్గు ఉండాలి’ అని మండిపడ్డారు.
సజ్జల వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. నిజమే.. చంద్రబాబుకు వచ్చింది షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మాత్రమే. కేసులతో తల్లడిల్లుతూ.. 52 రోజలుుగా బెయిల్ కోసం పోరాడుతున్న చంద్రబాబుకు ఇదే మాత్రం ఉపశమనం కలిగించే నిర్ణయం కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే పెద్ద ఊరడింపుగా భావిస్తున్నారు. ఇలాంటి వేళ.. బెయిల్ మీద సజ్జల చేసిన కామెంట్లు ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తాయంటున్నారు.
బెయిల్ రావట్లేదంటూ బాబుపై పెరుగుతున్న సానుభూతితో పాటు.. కోర్టు నిర్ణయాలపైనా వ్యాఖ్యలు.. విమర్శలు అంతకంతకూ పెరుగుతున్న వేళలో లభించిన తాత్కాలిక బెయిల్ పై సజ్జల ఇంతలా విరుచుకుపడాల్సిన అవసరం లేదంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఏ సమయంలో ఏం చేయాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? అంటూ సజ్జల తీరుపై మండిపాటు వ్యక్తమవుతోంది. నిజానికి.. తాత్కాలిక బెయిల్ తో బయటకు వస్తున్న చంద్రబాబుకు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్న వైనాన్ని ప్రజలకు వదిలేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందుకు భిన్నంగా ప్రతి విషయాన్ని ఇంత దూకుడుగా వ్యాఖ్యానించటం ద్వారా.. ప్రత్యర్థులకు మేలు కలిగించేలా ఉంటుందంటున్నారు. మరి.. ఇలాంటి విషయాల్ని సజ్జల మాష్టారు ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.