ఒకటి తర్వాత ఒకటి.. వరుస కేసులు! ఒకటి వదిలితే మరొకటి.. వరుస అఫిడవిట్లు! కోర్టుల్లో పిటిషన్లు!! ఇదీ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు నమోదు చేశారు. ఇక, స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ కేసుకు సంబంధించి చంద్రబాబు అరెస్టు, జైలు కూడా తెలిసిందే. అదేసమయం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో జరిగిన అల్లర్ల కేసును కూడా చంద్రబాబుపై బనాయించారు. ఇక, తాజాగా మద్యం డిస్టిలరీల కేటాయింపుల్లో 1300 కోట్ల మేరకు ఖజానాకు నష్టం చేకూర్చారని సర్కారు మరో కేసు నమోదు చేసింది.
ఇలా.. వరుస కేసులు.. అఫిడవిట్లతో సర్కారు దూకుడు చూపుతుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే.. ఇంతగా విపక్ష నేతను టార్గెట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇంతగా వైసీపీ దిగజారి వ్యవహరిస్తోందనే వాదన చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఏడాది కిందట నుంచి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత కదం తొక్కతున్నారు. అనేక కార్యక్రమాలను వంతుల వారీగా చేపడుతున్నారు. రహదారుల నిర్మాణం నుంచి టిడ్కో ఇళ్ల వరకు, ఎస్సీ,ఎస్టీలపై దాడుల నుంచి అవినీతి వరకు, ఇసుక, గనులు, మట్టి అక్రమాలపైనా చంద్రబాబు పోరు బాట పట్టారు.
ఎక్కడికక్కడ సర్కారుపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇక, ధరల పెంపు, నిత్యావసరాలు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలను సాధారణ ప్రజానీకంలోకి చంద్రబాబు జోరుగా తీసుకువెళ్లారు. ఇదే.. వైసీపీకి కంటగింపుగా మారింది. రాజకీయంగా చంద్రబాబు తమకు తీవ్ర అడ్డంకిగా మారారనేది వైసీపీ నేతల భావనగా పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ టార్గెట్‌గా చంద్రబాబు చేపట్టిన అనేక కార్యక్రమాలు వైసీపీపై ప్రజల్లో అప్పటి కే ఉన్న వ్యతిరేకతను వందింతలు రెట్టింపు చేసింది. దీంతో చంద్రబాబు వాయిస్‌ను నొక్కేస్తే తప్ప.. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు సాధ్యం కాదనే వ్యూహంతో వైసీపీ ప్రభుత్వం అడుగులు వేసిందనే వాదన వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకోవాలంటే.. బలమైన గళం కొన్నాళ్లపాటు వినిపించకుండా చేయాలనే పాతతరం రాజకీయాలకు పదును పెట్టినట్టుగా పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్లు ఎలాంటి చర్యలకూ ఒడిగట్టని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు ఆరు మాసాల ముందు.. చంద్రబాబు అనే మేరు నగాన్ని బంధీకృతిడిని చేయడం ద్వారా టీడీపీని, ఆ పార్టీ నాయకులు, శ్రేణులను డోలాయమానంలోకి నెట్టి.. అష్టదిగ్భంధనం చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కేసులపై కేసులు వేస్తూ.. చంద్రబాబును నిర్బంధించడమే పనిగా పెట్టుకుందని అంటున్నారు. అయితే..దీనివల్ల వైసీపీ సాధించింది ఏమీ లేకపోగా.. మరింత దిగజారిందనే వ్యాఖ్యలుసర్వత్రా వినిపిస్తున్నాయి.