ఉద్యోగం ఏదైనా.. ఉదయాన్నే చేయాల్సిన పనులు చేసేసి.. ఆఫీసుకు బయలుదేరి వెళ్లటం.. సాయంత్రం ఇంటికి తిరిగి రావటం. ఇదంతా మొన్నటి మాట. కరోనా పుణ్యమా అని ఆఫీసులకు బదులుగా ఇంట్లోనే ఉండి పని చేయటం మొదలైంది. కరోనా తర్వాత హైబ్రిడ్ విధానంలో వారంలో రెండు.. మూడు రోజులు ఆఫీసు కు వెళ్లిపని చేయటం.. మిగిలిన రోజులు ఇంట్లో నుంచి కనెక్టు కావటం తెలిసిందే. ఇప్పటికి ఈ విధానం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురికి ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా వారానికి 70 గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కామెంట్లు చేయగా.. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటివేళ.. మరో పారిశ్రామిక దిగ్గజం కమ్ బిలియనీర్ అయిన ఆర్జీపీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. నారాయణమూర్తి మాటల్ని ఆయన సమర్థించలేదు సరికదా.. కరోనా పుణ్యమా అని ఆఫీసులకు వచ్చి పని చేసే విధానం చచ్చిపోయిదంటూ కాస్తంత తీవ్రంగా మాట్లాడారు. ఎన్ని గంటలు పని చేస్తున్నారన్న దానిపై పట్టింపు లేదని.. పనిలో ఏదో ఒకటి సాధించాలన్న కసి ఉండాలన్నారు.
దీన్నే పరిగణలోకి తీసుకోవాలన్నది ఆయన పాయింట్. ఇప్పుడు తెర మీదకు వచ్చిన హైబ్రిడ్ పని విధానమే వర్తమానం.. భవిష్యత్తు అంటూ వ్యాఖ్యానించారు. కరోనా ఉద్యోగుల పని తీరును మార్చేసింది. పెద్ద ఎత్తున కంపెనీలు తమ ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసుకు వచ్చి పని చేయాలన్న ఆదేశాల్ని జారీ చేస్తున్నారు. ఇలాంటి వేళ.. హర్ష్ గోయెంకా నోటి నుంచి వచ్చిన ఈ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.