మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగినపుడు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది సీనియర్ నిర్మాత అల్లు అరవింద్‌కు సంబంధించింది కావడం విశేషం. గతంలో జరిగిన ఒక ఈవెంట్లో అరవింద్ మాట్లాడుతూ.. లావణ్య తెలుగు చక్కగా మాట్లాడుతూ, తెలుగమ్మాయిలాగా బాగా కలిసి పోయిందని.. ఒక తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిలైపోతే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆయన మాటలకు దేవతలు పైనుంచి తథాస్తు అన్నారేమో తెలియదు కానీ.. నిజంగానే ఆమె తెలుగబ్బాయి, అది కూడా అరవింద్ బంధువే అయిన వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. అతణ్ని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతంది. ఇప్పుడు అరవింద్ ఇంకో ఉత్తరాది భామకు ఇలాంటి సలహానే ఇవ్వడం వివేషం. ఆ అమ్మాయి ఎవరో కాదు.. మృణాల్ ఠాకూర్.
అల్లు అరవింద్ ఇటీవల ‘సైమా’ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ ‘సీతారామం’ సినిమాకు గాను మృణాల్‌కు అవార్డు అందుకుంది.
అనంతరం మాట్లాడుతూ.. ‘సీతారామం’ సినిమా మొదలైనప్పటి నుంచి తాను హైదరాబాద్‌ను సొంత ఇంటిలా ఫీలయ్యానని.. ముంబయికి వెళ్లాలనిపించేది కాదని వ్యాఖ్యానించింది. అంతే కాక ముంబయి నిర్మాతలందరూ మీరు హైదరాబాద్ షిఫ్టయ్యారా అని అడిగేవారని.. తనకు కూడా హైదరాబాద్ వచ్చేయాలని ఉందని ఆమె అంది. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ఒక తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో సెటిలైపోవాలని నవ్వుతూ అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పుడు లావణ్యను అరవింద్ దీవిస్తే.. నిజంగానే తెలుగబ్బాయిని పెళ్లాడిందని.. అలాగే ఇప్పుడు మృణాల్‌ను కూడా ఆశీర్విదించారు కాబట్టి ఆమె కూడా ఓ తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిలవుతుందేమో చూడాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.