పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి చాలా ఏళ్లయినా.. రేణు దేశాయ్ ని మెగా ఫ్యామిలీతో కలిపే చూస్తారు చాలామంది అభిమానులు. ఎందుకంటే పవన్‌తో ఆమె దశాబ్దానికి పైగా కలిసి సాగింది. ఆయనతో ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. పిల్లల ద్వారా మెగా ఫ్యామిలీకి ఆమెకు కనెక్షన్ కొనసాగుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు.
ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ పెళ్లికి రేణు హాజరవుతుందా అన్న చర్చ ఒకటి నడిచింది. కానీ ఆమె ఆ పెళ్లికి వెళ్లలేదు. వరుణ్‌తో తనకు మంచి అనుబంధం ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో తాను అతడికి పెళ్లికి వెళ్లలేనని రేణు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇటలీలో వరుణ్-లావణ్యల పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరుణ్ పెళ్లి గురించి రేణు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
‘‘వరుణ్ నా ముందే పెరిగాడు. నా ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయి. నేను తన పెళ్లికి వెళ్లలేను. నిహారిక పెళ్లికి కూడా నేను వెళ్లలేదు. పిల్లల్ని మాత్రం పంపించా. ఒకవేళ వరుణ్ పెళ్లికి నేను వెళ్లానంటే అక్కడున్న వాళ్లందరూ అసౌకర్యంగా ఫీలవుతారు’’ అని రేణు తెలిపింది. వరుణ్ పెళ్లికి భార్య అనా లెజ్నెవాతో కలిసి పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అలాంటపుడు ఆయన మాజీ భార్య అయిన రేణు అక్కడికి వెళ్లడం ఇబ్బందే.
ఐతే కొన్నేళ్ల ముందు పవన్ గురించి ఇంటర్వ్యూల్లో వ్యతిరేకంగా మాట్లాడిన రేణు.. ఈ మధ్య తన మాజీ భర్త గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తోంది. పెళ్లిళ్ల విషయంలో ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పార్టీల తీరును తప్పుబడుతోంది. రాజకీయంగా పవన్ ఏదైనా తప్పు మాట్లాడితే.. ఆయన విధానాలు బాలేకుంటే ఆ కోణంలోనే ఎదుర్కోవాలని.. ఆయన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదని.. ఫ్యామిలీని తీసుకురాకూడదని.. తమను టార్గెట్ చేయకూడదని ఈ ఇంటర్వ్యూలో ఆమె తేల్చి చెప్పింది.