మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని, భవిష్యత్తులో కూడా ఏ తప్పు చేయబోనని భావోద్వేగానికి గురయ్యారు. 50 రోజులుగా తాను, తన కుటుంబం కష్టకాలంలో ఉన్నానని, ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఎన్నో రాజకీయ పార్టీలు, ఎందరో రాజకీయ నేతలు, ఐటీ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అండగా నిలిచారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేకించి జనసేన పార్టీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు తనకు సంఘీభావంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని ధన్యవాదాలు తెలిపారు. తనకు సంఘీభావం ప్రకటించిన రాజకీయ నాయకులు, రాజకీయేతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అందరికీ ధన్యవాదాలు అని, ఆ అభిమానం, సంఘీభావం జీవితాంతం మరచిపోలేనని చెప్పారు.
ఇటీవల హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు తనకు సంఘీభావంగా ఓ కార్యక్రమం చేపట్టారని ‘గ్రాటిట్యూడ్ సీబీఎన్ కాన్సర్ట్’ గురించి చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. తాను అరెస్టయినప్పటి నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు, టిడిపి నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని,కొందరు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేశారని కృతజ్ఞతలు తెలిపారు. 52 రోజులుగా తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మీడియా ప్రతినిధులు, పలువురు నాయకులు, ఉద్యోగులు ప్రస్తావించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు.
రాజమండ్రి జైలు దగ్గరకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్ట్ వరకు భారీ ర్యాలీ చేపట్టేందుకు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు.