వాయిదాల మీద వాయిదాలు…నిరాశానిస్పృహలు…అన్నింటినీ దాటుకొని ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు కు హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించిందిలే అనుకుంటున్న తరుణంలో ఆయనపై మద్యం షాపుల కేటాయింపులలో అక్రమాలు అంటూ మరో కేసు నమోదైంది. అయితే, ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టు తలుపుతట్టారు.
ఈ క్రమంలోనే లాయర్లు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు చంద్రబాబుకు మరోసారి ఊరటనిచ్చింది. ఆ పిటిషన్ విచారణను నవంబర్ 21కి వాయిదా వేసిన హైకోర్టు అప్పటిదాకా ఆయనను అరెస్టు చేయవద్దని సూచించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని, వేరే ఏ కేసులోనూ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ హామీనిచ్చారు.
నవంబర్ 15న మద్యం కేసులో కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. అడ్వకేట్ జనరల్ స్టేట్మెంట్ ను హైకోర్టు రికార్డు చేసింది.
మరోవైపు, చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఓ కార్పొరేషన్ ఎండీ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవని, కాబట్టి మద్యం షాపుల వ్యవహారంలో చంద్రబాబుపై కావాలనే కేసు పెట్టారని ఆరోపించారు.