స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ లభించింది. 53 రోజుల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం చంద్రబాబుకు 4 వారాలపాటు షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. అనారోగ్య కారణాలు, చంద్రబాబు కుడి కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ రీత్యా కండిషనల్ బెయిల్ లభించింది. నవంబరు 28 వరకు చంద్రబాబుకు బెయిల్ లభించడంపై ఆయన కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నాలుగు వారాలలో చంద్రబాబు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదని కోర్టు షరతు విధించింది. కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. చంద్రబాబుతోపాటు ఇద్దరు డీఎస్పీలు ఎస్కార్ట్ ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్ధనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. జడ్+ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనలను అమలు చేయాలని, చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్యానించింది.
ఇక, ఈ రోజు సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం జైలు నుంచి ఎయిర్ పోర్టుకు వరకు భారీ ఊరేగింపు చేపట్టేలా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు తిరుపతి వెళ్లి వెంకన్నను దర్శించుకుంటారని తెలుస్తోంది. ా తర్వాత హైదరాబాద్ కు తీసుకువెళ్లి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స చేయించబోతున్నారు.చంద్రబాబు సతీమణి భువనేశ్వరితోపాటు ఆయన తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఇప్పటికే రాజమండ్రికి చేరుకున్నారు. యుద్ధం మొదలైందని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ అన్నారని తెలుస్తోంది.