హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు సందర్భంగా హైదరాబాద్ లో ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తీవ్ర భావోద్వేగాల నడుమ ఈ కచేరి సాగింది ఈ కాన్సర్ట్ లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుపు రుబెన్స్ టీం అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు అరెస్టు అయిన ఆవేదనతో తాను దసరా, వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదని, దీపావళి ఘనంగా జరుపుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, ఆ సమయానికి చంద్రబాబు విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు పేరు కాదని బ్రాండ్ కూడా కాదని మనిషి కూడా కాదని ఆయనొక దేవుడని బండ్ల కొనియాడారు. తనకు ఎనిమిది నెలల వయసన్నప్పుడు గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి బతకడానికి వలస వచ్చానని చెప్పారు. ఆ తర్వాత పొన్నూరులోని తమ పిన్ని వాళ్ళ కూతుర్లు, కొడుకులు అమెరికాలో సెటిల్ అయ్యారని, దాని వెనక చంద్రబాబు కృషి ఉందని, దేశ విదేశాల్లో ఐటీ ఉద్యోగులు సంతోషంగా ఉండడం వెనక చంద్రబాబు ఉన్నారని అన్నారు. హైదరాబాద్ కట్టిన కులీ కుతుబ్ షా పేరు 400 ఏళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటున్నారని, చంద్రబాబు కట్టిన సైబర్ టవర్స్ ను కూడా 4000 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటారని బండ్ల గణేష్ చెప్పారు.
శ్రీకృష్ణుడికి జైలే జన్మస్థానం అయిందని, అయినా శ్రీకృష్ణుడ దేవుడు కాకుండా పోయాడా అని చెప్పారు. అరణ్యవాసం వెళ్ళిన రాముడు దేవుడు కాదా అన్నారు. 40 రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన చంద్రబాబు దేవుడు కాకుండా పోతారా అని బండ్ల గణేష్ ఎమోషనల్ గా ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది. చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కడుపు రగిలిపోతోందని, చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమేననొ, అలాంటి వ్యక్తి దేశానికి అవసరం అని బండ్ల షాకింగ్ కామెంట్లు చేశారు.