తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇక, కాంగ్రెస్ గెలిస్తే పార్టీ బలోపేతం కావడానికి కారణమైన రేవంత్ రెడ్డే సీఎం అని డీకే శివకుమార్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అని డీకే శివకుమార్ అనలేదని, ఆయన ప్రసంగాన్ని అనువదించిన పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో అలా అన్నారని క్లారిటీనిచ్చారు. కాంగ్రెస్ లో ప్రతి ఎమ్మెల్యే ఒక సీఎం అభ్యర్థేనని కోమటిరెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరన్నది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ ఖాయమని జోస్యం చెప్పారు. కాగా, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ దక్కకపోవడంతో నాగం ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూలు టికెట్ ఆశించి భంగపడ్డ నాగం..కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
ఇక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత నాయకుడు గడ్డం వెంకటస్వామి కుమారుడు వివేక్ వెంకటస్వామి కూడా ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా తిరిగి సొంతగూటికి చేరుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వెంకట స్వామితో రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న వివేక్ ను కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వివేక్ తో పాటు బీజేపీపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంతో వివేక్ కూడా పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.