టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్ ఏం చేసినా సంచలనమే అన్నట్లుంటుంది. స్టేజ్ మీద మాట్లాడేటపుడైనా.. మీడియాలో చిట్ చాట్స్‌లో అయినా.. సోషల్ మీడియా పోస్టుల్లో అయినా.. అతను చేసే వ్యాఖ్యలు తరచుగా చర్చనీయాంశం అవుతుంటాయి. కొన్ని వివాదాల ద్వారా కూడా అతను వార్తల్లో వ్యక్తిగా మారాడు. తాజాగా అతను తన కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ విషయమై పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఈ సినిమాను తాము అనుకున్నట్లుగా డిసెంబరు 9న రిలీజ్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. బ్యాగ్రౌండ్ లేనందుకు తనను తొక్కేస్తున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడాడు విశ్వక్.
డిసెంబరు 9న ఈ చిత్రం రిలీజ్ కాకపోతే తాను ప్రమోషన్లకే రానన్నట్లుగా కూడా అతను వ్యాఖ్యానించాడు. బహుశా వేరే ప్రొడ్యూసర్లు.. తన నిర్మాత నాగవంశీ మీద ఒత్తిడి తెచ్చి ఈ సినిమా రిలీజ్ డేట్ మార్పిస్తున్న సంకేతాలు కనిపించడంతో విశ్వక్ ఇలా అల్టిమేటం విధించినట్లుగా భావిస్తున్నారు. ఐతే కొందరేమో అంత పోటీ మధ్య తన సినిమాను నిలబెట్టాలన్న పంతం విశ్వక్‌కు ఎందుకు.. క్లాష్ వచ్చినపుడు ఎవరో ఒకరు తగ్గడం మామూలే కదా అని అంటుంటే.. ఇంకొందరేమో తన ఆవేదనలో అర్థం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబరు రెండో వారానికి ముందు ఫిక్సయింది వరుణ్ తేజ్ సినిమా ‘ఆపరేషన్ వాలంటైన్’, విశ్వక్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’నే.
కానీ క్రిస్మస్ వీకెండ్ మీద ‘సలార్ బాంబు’ పడటంతో వేరే దారి లేక ‘హాయ్ నాన్న’, ‘ఎక్స్ట్రా’ చిత్రాలను డిసెంబరు రెండో వారానికి ప్రిపోన్ చేశారు. ఇప్పుడు అదే సమస్యగా మారింది. ఈ రెండు చిత్రాల మధ్య కొంచెం పలుకుబడి ఉన్న నిర్మాతలే ఉన్నారు. నాని సినిమా విషయంలో టీం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. దానికి మంచి బజ్ కూడా ఉంది. పోటీ గురించి భయపడే పరిస్థితి లేదు. నితిన్ సినిమాకు బజ్ తక్కువే కానీ.. నితిన్ తండ్రికి థియేటర్ల మీద పట్టు ఉండటం, దిల్ రాజుతో మంచి సంబంధాలుండటంతో థియేటర్ల పరంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. ‘ఆపరేషన్ వాలంటైన్’కైతే ఏమంత హైప్ లేదు. ప్రధానంగా నాని మూవీ నుంచే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి ముప్పు పొంచి ఉంది.
అయినా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్‌తో విశ్వక్ తన సినిమాను అప్పుడే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. కానీ ముందు వారం ‘యానిమల్’ భారీ స్థాయిలో రిలీజవుతోంది. దానికి తెలుగులో కూడా మంచి హైప్ ఉంది. మంచి టాక్ వస్తే రెండో వారంలోనూ పెద్ద సంఖ్యలో థియేటర్లు కొనసాగుతాయి. అప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి ఆశించిన స్థాయిలో స్క్రీన్లు దక్కవేమో అన్న భయం నాగవంశీకి ఉంది. వేరే సినిమాల నిర్మాతల నుంచి ఒత్తిడి కూడా ఉండటంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని ఆయన వాయిదా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది విశ్వక్‌కు నచ్చక ఇలా పోస్టు పెట్టినట్లు భావిస్తున్నారు.