టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 25 ఏళ్ల క్రితమే విజన్-2020 అనే నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన దార్శనీకుడు చంద్రబాబు. చంద్రబాబు చొరవతో హైదరాబాద్ లో పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఇటీవలే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. 1998లో చంద్రబాబు అంకురార్పణ చేసిన హైటెక్ సిటీ నేడు హైదరాబాద్ లో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. హైటెక్ సిటీ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే హైటెక్ సిటీ సృష్టికర్త చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు హైదరాబాద్ లో అక్టోబరు 29న ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్’ నిర్వహించబోతున్నారు. ఆదివారం నాడు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరగబోయే హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా విజనరీ లీడర్ చంద్రబాబుకు గ్రాటిట్యూడ్ తెలిపేందుకు ఐటీ ఉద్యోగులు భారీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ఈ కాన్సెర్ట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి లక్ష మంది వరకు ఐటీ ఉద్యోగులు వస్తారని అంచనా. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా…కాన్సెర్ట్ కోసం తెలుగు ఐటీ ఉద్యోగులు భారీ ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.