గత 50 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో జుడిషియల్ రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆరోగ్యం భద్రతపై ఆయన కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ మాగంటి బాబు సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు బదులు తాను జైల్లో ఉంటానని, జగన్ అందుకు అంగీకరించాలని సంచలన ప్రతిపాదనను మాగంటి బాబు పెట్టారు.
చంద్రబాబు వయసు, ఆరోగ్యం వంటి విషయాలను పరిగణించి ఆయనకు బదులు తనను జైల్లో పెట్టాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. గత రాత్రి తన కలలోకి వైయస్ రాజశేఖర్ రెడ్డి వచ్చారని, తండ్రి వయసున్న చంద్రబాబుపై జగన్ తీరు పట్ల విచారం వ్యక్తం చేశారని మాగంటి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ కు మంచి చెడులు చెప్పాలని తనకు వైఎస్ సూచించారని మాగంటి బాబు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. తన తండ్రి ఎన్టీఆర్, తన భర్త చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కూడా ఏనాడు గడప దాటని భువనేశ్వరి… చంద్రబాబు అరెస్టు తర్వాత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి వచ్చారని, ఆమెకు అందరూ మద్దతు ఇవ్వాలని మాగంటి బాబు పిలుపునిచ్చారు.
కాగా, చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితమని, 50 రోజులుగా జైల్లో చంద్రబాబు మగ్గుతున్నారని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని పోచారం అన్నారు. గతంలో కూడా చంద్రబాబు అరెస్టును పోచారం ఖండించిన సంగతి తెలిసిందే.