తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. ము ఖ్యంగా పచ్చగడ్డి వేసినా భగ్గుమనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కు మధ్య మాటల యుద్ధం మరింత పీక్కు చేరుకుంది. “కేసీఆర్కు నేనే మంత్రి పదవి ఇప్పించా. లేకపోతే.. ఆయనో అనామకుడుగా మిగిలిపోయేవారు. కానీ, ఈ విషయాన్ని మాత్రం ఆయన మరిచిపోయారు“ అని తాజాగా తుమ్మల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ నిప్పులు చెరిగారు. తుమ్మలకు కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టి పునర్జన్మ ప్రసా దించారని చెప్పారు. కేసీఆర్ పిలిచి పదవి ఇవ్వకపోతే.. తుమ్మల ఎప్పుడో రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిపోయేవారని పువ్వాడ వ్యాఖ్యానించారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు లేవు. తెలంగాణ ఉద్యమంతోనూ నీకు సంబంధం లేదు. పైగా.. జై తెలంగాణ అన్నవారిని జైల్లో పెట్టించిన ఘనత నీది. అయినా. కూడా కేసీఆర్ నీకు రాజకీయ భిక్ష పెట్టారు. అలాంటి నువ్వు కేసీఆర్పై చిందులు తొక్కుతావా“ అని పువ్వాడ వ్యాఖ్యానించారు.
ఇక, తనను ఓడించేందుకు కేటీఆర్ 2018లో కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బుల సంచులు పంపించారన్న తుమ్మల వ్యాఖ్యలపైనా పువ్వాడ విరుచుకుపడ్డారు. ఆ అవసరం కేటీఆర్కు లేదన్నారు. తనకు కేటీఆర్కు మధ్య పేగు బంధం వంటి స్నేహ బంధం ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్ తుమ్మలేనని పువ్వాడ వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ, తర్వాత బీఆర్ ఎస్, ఇప్పుడు కాంగ్రెస్లో చేరి.. మురికి రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.