రాజకీయంగా ఒక్క ఛాన్స్ దక్కితే చాలు.. నాయకులు విజృంభించేందుకు తిరుగు ఉండదు. ఇది ఇప్పుడు టీడీపీలో ఖచ్చితంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండడంతో ఇప్పటి వరకు ఈ కుటుంబం నుంచి ఇద్దరు మాత్రమే చక్రం తిప్పిన రాజకీయాల్లో మరో ఇద్దరు కలిసి వచ్చారు. వారే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఆయన కోడలు నారా బ్రాహ్మణి. ఇప్పటికే నారా లోకేష్ దూకుడుగా ఉన్నారు. సో.. చంద్రబాబు స్థానం భర్తీ కాకపోయినా.. ఈ ముగ్గురు మాత్రం ప్రజల్లోకి వచ్చేశారు.
ప్రత్యక్షంగా నారా భువనేశ్వరి ఇప్పటికే `నిజం గెలవాలి` నినాదంతో ప్రజల మధ్యకు వచ్చారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ఉద్దేశం చంద్రబాబుపై దిగులుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడం. ఇదే విషయాన్ని భువనేశ్వరి కూడా ప్రకటన రూపంలో వెల్లడించారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. కానీ, తొలిరోజు ఆమె నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన జనాభాను చూసిన తర్వాత.. వ్యూహం మార్చుకుని ముందుకు సాగుతున్నారు.
మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో నారా భువనేశ్వరి గురు, శుక్రవారాల్లో పూర్తిగా రాజకీయ పరమైన అంశాలపై దృష్టి పెట్టారు. రాజధాని, వైసీపీ పాలన, కుట్ర పూరిత కేసులు, చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలు.. ఇలా అనేక అంశాలను ప్రస్తావించారు. ఇక, శుక్రవారం అయితే.. మొత్తంగా నారా భువనేశ్వరి రాజకీయ ప్రచారమే చేశారు. జనసేన – టీడీపీ గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఇక, నారా లోకేష్ త్వరలోనే భవిష్యత్తుకు గ్యారెంటీ యాత్ర ప్రారంభించనున్నారు. ఇది కూడా దూకుడుగా నే ముందుకు సాగేలా పార్టీ ప్రణాళికలు రెడీ చేసింది. మరోవైపు.. నారా బ్రాహ్మణి ప్రత్యక్షంగా ప్రజల్లోకి వస్తూనే మరోవైపు ఐటీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా.. పార్టీ కార్యక్రమాలకు మరింత ప్రచారం లభించేలా తెరవెనుక చక్రం తిప్పే బాధ్యతలను తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చంద్రబాబు స్థానం ఎలా ఉన్నా.. నారా కుటుంబం మొత్తం ఇప్పుడు ప్రజల్లోకి రావడం.. అందునా కీలక ఎన్నికల సమయంలో దూకుడు పెంచడం కలిసి వస్తుందని అంటున్నారు.