టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో అర్ధరాత్రి హైడ్రామా మధ్య అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నిద్రపోతున్న చంద్రబాబు బస్సు తలుపులు తట్టిన సీఐడీ అధికారులు, పోలీసులు తెల్లవారుఝాము వరకు వేచి మరీ అరెస్టు చేశారు. అయితే, అరెస్టు సమయంలో సీఐడీ అధికారులు పలువురితో ఫోన్ లో మాట్లాడారని, అందుకే ఆ సమయంలో ఆ అధికారుల కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు తరఫు లాయర్లు ఏసీబీ కోర్టులో 40 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరిస్తుందని టీడీపీ నేతలు భావించారు. అయితే, ఆ పిటిషన్ పై తీర్పును ఈ నెల 31కి జడ్జి రిజర్వ్ చేశారు. విచారణ సందర్భంగా కోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. అరెస్టు సమయంలో అధికారులు ఎవరితో సంప్రదింపులు జరిపారో తెలిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబు తరఫు లాయర్లు వాదించారు. అయితే, ఆ కాల్ డేటా ఇస్తే వారి వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు భంగం కలుగుతుందని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు.
మరోవైపు, టీడీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కోరుతూ సీఐడీ అధికారులు టీడీపీ నేతలకు జారీ చేసిన నోటీసులను టీడీపీ తరఫు న్యాయవాదులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ రోజు వెకేషన్ బెంచ్ ముందు సీఐడీ నోటీస్లపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటీషన్ను హైకోర్టు అనుమతించి విచారణ చేపట్టనుంది.