టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, వారి తనయుడు లోకేష్ లపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ఇష్టారీతిన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రపై కూడా అంబటి వ్యంగ్యంగా విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన అంబటికి తెలుగు తమ్ముళ్లు చుక్కలు చూపించారు. ఖమ్మం పట్టణంలో అంబటి కారును అడ్డుకొని…అంబటి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
అంబటి రాంబాబుకు ఖమ్మంలో చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ఎస్ నేత ఇంట్లో శుభకార్యానికి హాజరైన అంబటి ఓ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు వెళ్లగా…హోటల్ దగ్గరకు టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. హోటల్ నుంచి బయటకు వస్తున్న అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని హోటల్ ముందు ధర్నాకు దిగారు. అంబటి గోబ్యాక్…జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు వచ్చి అంబటి రాంబాబు కారును అక్కడి నుంచి సురక్షితంగా పంపించేశారు.