విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా అక్టోబర్ 25వ తారీఖున పలు సంచలన విషయాలను వెల్లడిస్తూ చంద్రబాబు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగు చూసింది. జైల్లో తన భద్రతకు ముప్పు ఉందని, తన ఆరోగ్యం క్షీణిస్తోందని, తనను చంపేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
తీవ్రవాదుల కుట్ర గురించిన లేఖ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి వచ్చిందని, కానీ ఆ వ్యవహారంపై ఆయన విచారణ జరపలేదని చంద్రబాబు అన్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల కదలికలను గమనించేందుకు జైలుపై డ్రోన్లు ఎగురవేస్తున్నారని, ఈ విషయంపై జైలు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. ఓ ముద్దాయి పెన్ కెమెరాతో ఫోటోలు, వీడియోలు తీస్తున్నట్టుగా తనకు తెలిసిందని, ఆ వ్యక్తిపై ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోలేదని ఆరోపించారు.