టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సినీ ఇండస్ట్రీ నుంచి కొందరు దర్శకులు, నిర్మాతలు మద్దతుగా వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ తో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, పలువురు ఖండించారు. అయితే, ఇండస్ట్రీ నుంచి తగినంత స్పందన రావడంలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబుకు అండగా ఉన్నామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఏర్పాటుచేసిన ‘చంద్రబాబు గారితో మనం’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన దామోదర్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ తాత ముత్తాతలు కాలంనుంచి ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం ఉందని, చంద్రబాబుతో కూడా వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు. నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజల కోసం చంద్రబాబు ఎన్నో చేశారని, ఆయన కట్టిన హైటెక్ సిటీ వల్లే లక్షలాది మంది తెలుగు యువత విదేశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. రాజకీయ చదరంగంలో ఆటలు సహజమని కానీ చంద్రబాబు వయసు దృష్టిలో పెట్టుకోకుండా ఇన్ని రోజులు అరెస్ట్ చేయడం చూస్తుంటే న్యాయవవస్థపై నమ్మకం పోతుందని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో, సీనియర్ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా పాల్గొని చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజకీయవేత్తగా గతంలో చంద్రబాబు అరెస్టును ఖండించిన మురళీమోహన్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అరెస్టుపై ప్రతి ఒక్కరు రగిలిపోతున్నారని.. 74 ఏళ్ల వయసులో ఆయనను అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. పులి, సింహం నాలుగడుగులు వెనక్కి వేసి మరింత బలంగా ముందుకు దూకినట్టు చంద్రబాబు కూడా రెట్టించిన ఉత్సాహంతో కదనరంగంలో దూకుతారని మురళీమోహన్ అన్నారు. చంద్రబాబుకి ఇది గ్రహణం వంటిదని గ్రహణం వీడిన తర్వాత వెలుగులతో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు.