టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడును వైసీపీ సర్కారు అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించిందని టీడీపీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనను దాదాపు 40 రోజులకు పైగానే ఉన్నారు. అయితే, చంద్రబాబు ఆరోగ్యంపై ఈలోగా వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యం సరిగా లేదని.. డీహైడ్రేషన్‌కు గురయ్యారని వార్తలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు కోసం ఓ రైతు చర్చిలో ప్రార్థనలు చేశారు. అయితే, ఆయన ప్రార్థనలు చేస్తూ అక్కడే ప్రాణాలు వదలడం.. తీవ్ర విషాదాన్ని నింపింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెం ప్రాంతానికి చెందిన మాజీ పాస్టర్ ఈపూరి దేవసహయం(60) చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం చూపేవారు. చంద్రబాబు అరెస్టయిన దగ్గర నుంచి చేపట్టిన అన్ని నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాజధాని ప్రాంతంలోని ఈలప్రోలు గ్రామంలో ఏసుక్రీస్తు ప్రార్థనా కూటములు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకుని కుటుంబ సమేతంగా కూటాలకు వెళ్లిన దేవసహాయం.. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, ఆయనకు బెయిల్ వచ్చి.. క్షేమంగా బయటకు రావాలని ప్రార్థన చేశారు. త్వరగా అక్రమ కేసులు నుంచి బయట పడాలని కోరుకున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే.. చంద్రబాబు గురించి ప్రార్థన చేస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో దేవసహాయం అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన బంధువులు దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించగా దేవసహాయం ప్రాణాలు కోల్పాయారు. కాగా, చంద్రబాబుపై చింతతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 158 మంది ప్రాణాలు కోల్పోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే.