టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల మధ్య దసరా నాడు కీలక భేటీ జరగబోతోన్న సంగతి తెలిసిందే. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ భేటీ తోపాటు, ఇరు పార్టీల భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సమావేశానికి ముందు జైల్లో టిడిపి అధినేత చంద్రబాబును లోకేష్ కలిశారు. పవన్ తో సమావేశంపై లోకేష్ కు చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
కరువు రైతుల సమస్యలు, కృష్ణా జలాల పునఃపంపిణీతో పాటు పలు ప్రజా సమస్యలపై చంద్రబాబుకు లోకేష్ వివరించారట. జైలు నుంచి చంద్రబాబు లేఖ విడుదల చేయడం, ఆ లేఖ జైలు నుంచి రాలేదని జైలు అధికారులు చెప్పడం, దానిపై వైసీపీ రాజకీయం చేస్తోందని చంద్రబాబుకు లోకేష్ చెప్పారు. నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల పెంపు తదితర అంశాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని లోకేష్ కు చంద్రబాబు చెప్పారు.
ఆ తర్వాత జగన్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకో జగన్ అనావృష్టికి అన్నయ్య అని, జగన్ చూపుతో పచ్చని పంట పొలాలు ఎండిపోతాయని విమర్శించారు. జగన్ అడుగుపెడితే నిండుకుండలా ఉన్న డ్యామ్ ల గేట్లు కొట్టుకుపోతాయని ఎద్దేవా చేశారు. జగన్ కరువుకు బ్రాండ్ అంబాసిడర్, దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ అని సెటైర్లు వేశారు. ఏపీలో గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం నమోదైందని, రైతులు సాగునీటి కోసం నానా తిప్పలు పడుతున్నారని అన్నారు. కానీ, తాడేపల్లి కొంపలో నీరో చక్రవర్తి లాగా జగన్ ఇసుక, లిక్కర్ లెక్కలతో, చంద్రబాబుపై కక్ష సాధింపుతో తీరిక లేకుండా ఉన్నారని చురకలంటించారు.