నందమూరి బాలకృష్ణ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమా ఆదిత్య 369. ఇప్పుడు చూసినా కూడా ట్రెండీగా, ఎంతో ఆసక్తికరంగా అనిపించే చిత్రమది. అందులో బాలయ్య పెర్ఫామెన్స్ కూడా అద్భుతం. ఆ క్లాసిక్ మూవీకి సీక్వెల్ తీయాలని ఎప్పట్నుంచో చూస్తున్నాడు బాలయ్య. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆ సినిమా చేయడానికి ఒక దశలో గట్టి ప్రయత్నాలు జరిగాయి. సినిమా అనౌన్స్ చేశారు కూడా. కానీ తర్వాత పక్కకు వెళ్లిపోయింది.
ఐతే ఈ సినిమాను తనే డైరెక్ట్ చేయబోతున్నట్లు కొన్నాళ్ల కిందట బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే. అందులో తన కొడుకు మోక్షజ్ఞ కూడా ఓ కీలక పాత్ర చేస్తాడని కూడా ఆయనన్నాడు. తాజాగా తన కొత్త చిత్రం భగవంత్ కేసరి ప్రమోషన్ల కోసం శ్రీలీలతో కలిసి చేసిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 గురించి మాట్లాడాడు.
ఈ సినిమా కథ తనే రాశానని.. అది కూడా ఒక్క రాత్రిలో అంతా అయిపోయిందని చెప్పాడు.
ఒక రాత్రి పడుకుని ఉదయం లేవగానే ఆశువుగా కథ వచ్చేసిందని.. వెంటనే స్క్రిప్టు రెడీ చేసేశానని బాలయ్య తెలిపాడు. దీంతో పాటు తన దగ్గర మరికొన్ని సొంత కథలు ఉన్నట్లు బాలయ్య చెప్పాడు. వీటిలో ఒకదాంతో తన కొడుకును హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నట్లు బాలయ్య తెలిపాడు. ఆదిత్య 999 లేదా మరో కథతో మోక్షజ్ఞ అరంగేట్రం ఉంటుందని బాలయ్య చెప్పాడు.
తన కొడుకు కెరీర్ గురించి తనకు కొంచెం కూడా ఆందోళన లేదని.. ఈ విషయంలో బిందాస్‌గా ఉన్నానని బాలయ్య తెలిపాడు. మోక్షజ్ఞ అరంగేట్రం ఎప్పుడు ఉండొచ్చన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చే ఏడాది కచ్చితంగా అతణ్ని హీరోగా పరిచయం చేస్తానని బాలయ్య స్పష్టం చేశాడు. త్వరలో ఆ విశేషాలు వెల్లడిస్తామని కూడా బాలయ్య చెప్పాడు.