అల వైకుంఠపురం సినిమాలో బన్నీకి కాళ్ల ఫ్యాంటసీ మాదిరిగా ఏపీ సీఎం జగన్ కు ఫొటోల ఫ్యాంటసీ ఉందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టులు మొదలు సామాన్యుల వరకు విమర్శలు గుప్పిస్తున్నా సరే జగన్ ఫొటోల ఫ్యాంటసీ మాత్రం తగ్గడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ‘వైస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష’ పథకం పాస్ పుస్తకాల కవర్ పేజిలలో జగన్ ఫొటోలు ‘శాశ్వతం’గా ఉండేలా ముద్రించడంపై గతంలో విమర్శలు వచ్చాయి.
ఆఖరికి బడి పిల్లలు తినే ఫల్లీ చిక్కీల కవర్లపై కూడా జగన్ ఫొటోలు ముద్రించడం విమర్శలకు దారి తీసింది. ఇక, కొన్ని కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య పథకాలకు కేవలం జగన్ ఫొటో వేసుకోవడం, ప్రధాని మోడీ ఫొటో లేకపోవడం కేంద్రంలోని బీజేపీ నేతలకు కూడా మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ కు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ షాకిచ్చారు. ప్రధాని మోడీ ఫోటో లేకుంటే ఏపీ ప్రభుత్వానికి నిధులు ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మోడీ ఫోటోలు పెట్టకుండా జగన్ ఫొటోలు మాత్రమే పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి గాంధీభవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు ఏపీకి ఇస్తున్నామని అన్నారు. ఇకపై ప్రధాని మోడీ ఫోటో పెట్టకుండా పథకాలు అమలు చేస్తే కేంద్రం ఇచ్చే నిధులు ఏపీ ప్రభుత్వానికి ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్ కు ఇదే చివరి వార్నింగ్ అని అన్నారు. ఇలాగే కొనసాగితే తన శాఖ పరిధిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపేస్తానని వార్నింగ్ ఇచ్చారు.