ఏపీ ఫైబర్ నెట్ కేసుతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కక్షపూరితంగా పెట్టినవేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని, కానీ, ఇపుడు పెట్టిన ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు పెట్టి రిమాండ్ కు పంపించారని విమర్శిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేయడమే కాకుండా అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.
ఫైబర్ నెట్ కేసు జగన్ వ్యక్తిగత కక్ష మాత్రమేనని, కేసులో ఏమి లేదని రఘురామ ఆరోపించారు. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో త్వరలోనే తీర్పు వచ్చే అవకాశముందని అన్నారు. భగవంత్ కేసరి సినిమా బాగుందని, డ్రగ్స్ ఒక పోర్టుకు రావడం, సీఎం దాని వెనక ఉండడం అనే కాన్సెప్ట్ తో సినిమా ఉందని రఘురామ కితాబిచ్చారు. విద్యా వ్యవస్థలో సీఎం, ప్రభుత్వం తన తెలివితో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంగ్లీష్ మీడియం అందరూ చదువుకోవాలని జగన్ అంటున్నారని, ఇంగ్లీష్ మీడియం మొదటి నుంచి ఉందని అన్నారు. డబ్బులు తినేయడానికి ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు న్యాయవాదులకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని లక్ష్మీపార్వతి అంటున్నారని, ముకుల్ రోహత్గికి ఇతర న్యాయవాదులకు జగన్ ఇన్ని ఏళ్ల నుంచి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఆయన్నే అడగాలని లక్ష్మీపార్వతికి చురకలంటించారు.