దౌర్జన్యం.. అరాచకం.. అనే పదాలు వినడమే తప్ప.. ఎప్పుడూ నేరుగా చూసి ఉండరు. అయితే.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఈ రెండూ ప్రత్యక్షంగా కనిపించాయి. వినిపించాయి కూడా. టీడీపీ సానుభూతి పరులు, తెలుగు దేశం పార్టీ జెండా కూడా.. పుంగనూరులో కనిపించకూడదు.. సానుభూతి అనే మాటే వినిపించకూడదు అన్నట్టుగా ఇక్కడి పెద్దిరెడ్డి అనుచర గణం చిందులు తొక్కింది.
స్కిల్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబును సర్కారు రాజమండ్రి జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజులకు పైగానే బాబు జైల్లో ఉన్నారు. అయితే.. ఆయన విషయంలో సానుభూతి వ్యక్తం చేస్తూ.. సర్కారు చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎవరికి తోచిన రీతిలో వారు బాబుకు మద్దతు పలుకుతున్నారు. ఇలా.. శ్రీకాకుళానికి చెందిన కొందరు యువకులు.. బాబుకు మద్దతుగా సైకిల్ యాత్ర చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం వరకు ఈ సైకిల్ యాత్ర నడుస్తోంది. ఎన్ని రోజులుగా చేస్తున్నారో తెలియదు కానీ.. తాజాగా శనివారం ఉదయం యాత్రికులు.. పుంగనూరుకు చేరుకున్నారు. అక్కడి నుంచి మరికొన్ని కిలోమీటర్లు దాటితే.. కుప్పంలో వారు యాత్రను ముగించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పుంగనూరు రోడ్డు పక్కన ఆగి టీ తాగుతున్నారు.
సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ సానుభూతిపరులు.. పసుపు రంగు చొక్కాలు ధరించి.. మెడలో టీడీపీ కండువాలు వేసుకుని ఉన్నారు. దీంతో ఈ విషయం పెద్ద రెడ్డి అనుచరులకు తెలిసిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పెద్దిరెడ్డి గ్యాంగ్.. యాత్ర చేస్తున్న టీడీపీ సానుభూతిపరులపై వీర ప్రతాపం చూపించారు. అమ్మ నా బూతులతో విరుచుకుపడ్డారు.
అంతేకాదు.. నడిరోడ్డుపై వారిని అర్థనగ్నంగా నిలబెట్టి.. చొక్కాలు మార్పించారు. సైకిళ్లకు ఉన్న పచ్చ జెండాలు తొలగించారు. కుప్పం వెళ్లేందుకు వీల్లేదని వారిని తిప్పి పంపించారు. ఈ పరిణామాలు వీడియో తీయించి మరీ.. సోషల్ మీడియాలో పెట్టడం గమనార్హం. అంతేకాదు.. ఇది.. పెద్దిరెడ్డి అడ్డా.. ఇక్కడికెవరొస్తార్రా! అంటూ.. బండ బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో భీతిల్లిన బాబు సానుభూతి పరులు.. పెద్దిరెడ్డి గ్యాంగ్ చెప్పినట్టే చేసి ప్రాణాలు అరచేత పట్టుకుని.. బిక్కుబిక్కుమంటూ గడపడం గమనార్హం.