ఆ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన తనయులను బరిలో దించారు. పార్టీ తరపున టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా సీఎం పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి రావొచ్చేమో అని అంటున్నారు. అసలు ఎన్నికలకు దూరమై.. పోటీ చేయకుండా ఉంటున్న ఆయనకు సీఎం పదవి ఎలా వస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం ఆ సీనియర్ నాయకుడే చెప్పాలి. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరంటే.. జానారెడ్డి.
పార్టీలో మంచి పట్టున్న సీనియర్ నాయకుడు జానారెడ్డి ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. కొడుకుల రాజకీయ భవిష్యత్ కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జానారెడ్డి చిన్న తనయుడు జై వీర్ రెడ్డికి ఇప్పటికే కాంగ్రెస్ నాగార్జున సాగర్ టికెట్ కేటాయించింది. ఇక పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి నాగార్జున సాగర్ తో పాటు మిర్యాలగూడ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మరి మిర్యాలగూడ పొత్తులో భాగంగా వామపక్షాలకు వెళ్తుందా? లేదా రఘువీర్ రెడ్డికే టికెట్ వస్తుందా? అన్నది చూడాలి. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జానారెడ్డి మంత్రిగా అత్యధిక కాలం పని చేసిన నాయకుడిగానూ నిలిచారు. కానీ 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ లో పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికల్లోనూ పరాజయం పాలయ్యారు.
ఇప్పుడు ఎన్నికల బరి నుంచి తప్పుకుని తనయుల రాజకీయ వ్యవహారాల్లో కీలకంగా ఉంటున్నారు. కానీ ఉన్నట్లుండి సీఎం పదవి గురించి జానారెడ్డి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా జానారెడ్డి ఇలా మాట్లాడారు. తాను ఊహించని విధంగా వీళ్లంతా కాంగ్రెస్ లో చేరారు.. అలాగే సీఎం పదవి కూడా హఠాత్తుగా తనకు దక్కుతుందేమోనని జానారెడ్డి అన్నారు. తాను ఏ పదవినీ కోరుకోవడం లేదని కానీ సీఎం పదవి రావచ్చేమోనని పేర్కొన్నారు.
దీంతో అసలు ఎన్నికల బరిలో దిగిన జానారెడ్డికి సీఎం పదవి ఎలా వస్తుందనే ప్రశ్న రేకెత్తుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ గెలిస్తే సీఎం పదవి కోసం పోటీ తీవ్రంగానే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి తదితరులు రేసులో ఉన్నారు. పైగా వీళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దీంతో జానారెడ్డివి వట్టి మాటలేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.