అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబు కు ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. నవంబరు 7వ తేదీ వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించిన కోర్టు..ఆ పిటిషన్ పై విచారణను నవంబరు 7వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. స్కిల్ కేసులో తీర్పు రింగు రోడ్డు కేసుకు కూడా వర్తిస్తుందని, అందుకే విచారణను నవంబరు 7కు వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరగా కోర్టు అంగీకరించింది. ఇక, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారెంట్ పై స్టేను నవంబర్ 7వ తేదీ వరకు పొడిగించింది.
కాగా, జగత్ జనని చిట్ ఫండ్ కంపెనీలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అప్పారావుతోపాటు ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిని సీఐడీ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా…సుప్రీం కోర్టు…హైకోర్టు తీర్పును సమర్థించింది. అప్పారావు తరఫున సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు.