టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో, ఆ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
మరోవైపు, చంద్రబాబు హెల్త్ బులెటిన్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు విడుదల చేశారు. 38 రోజులుగా చంద్రబాబును జైల్లోని స్నేహ బ్యారక్‌లో ఉంచామని, ప్రతిరోజు మూడు సార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఇంటి భోజనానికి అనుమతిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని, బీపీ, శరీర ఉష్ణోగ్రత, ఊపిరితిత్తుల పరిస్థితి, నాడి వేగం సాధారణంగా ఉన్నాయని బులెటిన్ లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ ఏర్పాటు చేశామని చెప్పారు.
కాగా, ఫైబర్ నెట్ కేసులో శుక్రవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం వరకు చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచవద్దని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో, సుప్రీంకోర్టు సూచనలను సీఐడీ అధికారులు మెమో రూపంలో ఏసీబీ కోర్టుకు సమర్పించారు.