నందమూరి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది. బాలకృష్ణ కొత్త చిత్రం ‘భగవంత్ కేసరి’ ఇంకొక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతోంది. ఈ గురువారం ‘లియో’తో పాటుగా అది రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దసరా సీజన్ కావడంతో వీటితో పాటుగా రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా బరిలోకి దిగుతోంది.
ఇంత పోటీ ఉన్నప్పటికీ.. ‘భగవంత్ కేసరి’ అంచనాలను మించిపోతుందని టీం ధీమాగా ఉంది. ఈ సినిమాకు కొంచెం పెద్ద స్థాయిలోనే బిజినెస్ జరిగింది. థియేటర్ల నుంచి ఈ సినిమా భారీగానే షేర్ రాబట్టాల్సి ఉంది. ఆ మొత్తం దాదాపు రూ.65 కోట్లు కాడడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ బాలయ్య సినిమాకు మంచి రేటే పలికింది. నైజాంలో ఈ సినిమా టార్గెట్ రూ.12 కోట్లు. వేరే పెద్ద స్టార్ల సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ మొత్తమే కానీ.. నైజాంలో కొంచెం వీక్ అయిన బాలయ్యకు ఇది పెద్ద మొత్తమే.
సీడెడ్‌లో బాలయ్యకు ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి.. నైజాంతో సమానంగా రేటు రావడం విశేషం. ఆంధ్రా ప్రాంతంలోని మిగతా అన్ని ఏరియాలకూ కలిపి దాదాపు రూ.30 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. మొత్తంగా ఏపీ-తెలంగాణల్లోనే ఈ చిత్రం రూ.54 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉంది. ఇండియాలో మిగతా అన్ని ప్రాంతాలకూ కలిపి రూ.4 కోట్లకు హక్కులు అమ్మగా.. ఓవర్సీస్ రేటు రూ.6 కోట్లు పలికింది. మొత్తంగా ఈ చిత్రం రూ.65 కోట్ల షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
అంటే గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్లు దాటాలి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. దసరా సెలవులను ఉపయోగించుకుని సినిమా లాభాల బాట పట్టే అవకాశముంది. కానీ లియో, టైగర్ నాగేశ్వరరావు కూడా ప్రామిసింగ్‌గా కనిపిస్తుండటంతో వాటి పోటీని తట్టుకుని ఈ మేరకు వసూళ్లు రాబట్టాలంటే అంత సులువు కాదు. మరి బాలయ్య-అనిల్ రావిపూడిల క్రేజీ కాంబో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి.