టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని, చంద్రబాబుపై కేసులు నమోదు చేయడం దారుణమని షాకింగ్ కామెంట్లు చేశారు. వ్యక్తిగతంగా చంద్రబాబుతో అనుబంధం ఉందని, చాలా మంచి వ్యక్తి అని ప్రశంసించారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.
చంద్రబాబు తప్పు చేసినట్టు ఆధారాలు, రుజువులు లేవని, ఆరోపణలతోనే ఆయనను జైల్లో పెట్టడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరహాలోనే చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 38 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచడం పెద్ద తప్పని ఆయన అన్నారు. తమిళనాడు తరహా రాజకీయాలను ఆంధ్రాలోకి తెచ్చారని విమర్శలు గుప్పించారు. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తుకు టీడీపీ, జనసేనలను ఆహ్వానిస్తున్నామని అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10 నుంచి 15 శాతం వరకు పెరిగిందని చెప్పారు. తమ పార్టీతో కలిసిన వారు తప్పకుండా అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలన అధ్యాన్నంగా ఉందని, ఏపీని అప్పుల ఊబిలోకి జగన్ దించారని ఆయన విమర్శించారు.