టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కంటతడి పెట్టారు. ఈ రోజు సాయంత్రం ప్రత్యేక ములాఖత్ ద్వారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును ఆమె తన కుమారుడు, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు, కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడతారని అందరూ భావించారు.
కానీ, నారా భువనేశ్వరి మాత్రం మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వారు ఉంటున్న క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఇక, నారా లోకేష్ మాత్రం ములాఖత్ అనంతరం అక్కడే ఉన్న జైళ్ల శాఖ డీఐజీతో ముఖాముఖి మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యులు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఇచ్చిన తాజా నివేదికను ఆయనకు చూపించి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, చల్లని వాతావరణం ఆయనకు అవసరమని ప్రభుత్వ వైద్యులే సూచించారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
వాస్తవాలను పక్కన పెట్టి, చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని డీఐజీ రవి కిరణ్‌ని నారా లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైద్యులు చేసిన సూచనలను ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబును చల్లని వాతావరణం(ఏసీ)లో ఉంచాలని వైద్యులే సూచించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
వైద్యుల సూచనలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులుగా మీకు లేదా అని నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికలను కూడా తొక్కి పెడుతున్నారని, వాస్తవాలను బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. నారా లోకేష్ ఎన్నిప్రశ్నలు సంధించినా.. డీఐజీ రవి కిరణ్ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పుకుండా మౌనం వహించారు. దీంతో నారా లోకేష్ అక్కడ నుంచి బస చేసిన ప్రాంతానికి వెళ్లిపోయారు.