తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా పడడంతో గ్రూప్ -2 పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. ప్రవళిక మరణం తనను బాధించిందని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రవళికది ఆత్మహత్య కాదని, హత్యని ఆరోపించారు. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుందని రాహుల్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని బలోపేతం చేస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనిచ్చారు.
ప్రవళిక మరణం నేపథ్యంలో కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు లేక ప్రవల్లిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని, కేసీఆర్ ను చూసి ఓటెయ్యమని ఎలా అడుగుతున్నారని కేటీఆర్ ను నిలదీశారు. పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవల్లికది ఆత్మహత్య కాదని.. బీఆర్ఎస్ సర్కార్ చేసిన హత్య అని ఆరోపించారు.
నష్ట జాతకురాలు ప్రవల్లిక కాదని.. అన్ని అధికారాలున్నా నిరుద్యోగుల కోసం ఏం చేయలేని పాలకులు నష్ట జాతకులని షర్మిల అన్నారు. ఉద్యోగాలకు సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వక, పరీక్ష సక్రమంగా నిర్వహించడం చేతకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం అని మోసం చేసినందుకు మీకు ఓటేయాలా అని నిలదీశారు. అంగట్లో సరుకుల్లా టీఎస్పీఎస్సీ పేపర్లు అమ్ముకున్నందుకు ఓటేయాలా అని ప్రశ్నించారు. ఆ తల్లిదండ్రుల ఉసురు మీకు, మీ సర్కార్ కు తగలక మానదని అన్నారు.