తెలుగుదేశం యువ నేత నారా లోకేష్.. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం ఆశ్చర్యపరిచింది. అతను పది రోజుల ముందే ఢిల్లీకి వెళ్లాడు. దాదాపు వారం పాటు అక్కడే ఉన్నాడు. మరి షాను కలవాలని అనుకుని ఉంటే అప్పుడే అపాయింట్మెంట్ తీసుకుని కలిసి ఉండొచ్చు. తిరిగి ఏపీకి వచ్చాక ప్రత్యేకంగా వెళ్లి షాను కలిశాడు. ఈ మీటింగ్‌లో ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి, కిషన్ రెడ్డి కూడా ఉండటం అందరి దృష్టినీ ఆకర్షించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబు నాయుడిని రక్షించాలని కోరేందుకే లోకేష్.. షాను కలిసినట్లుగా వార్తలు వచ్చాయి ముందు. కానీ తర్వాత లోకేష్ మాట్లాడుతూ.. తనను కలవాలని షా నుంచే పిలుపు వచ్చిందని.. అందుకే వెళ్లి కలిసి వచ్చానని తేల్చి చెప్పాడు. బాబు కేసు విషయంలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి లోకేష్‌ను బీజేపీ పిలిచి ఉంటుందనుకోవడానికి అవకాశమే లేదు.
నారా లోకేష్‌ను తన వెంట తీసుకెళ్లడమే కాదు.. ఆ కలయిక గురించి ముందు ట్వీట్ చేసింది కూడా పురంధరేశ్వరినే అనే విషయం గమనార్హం. అంతే కాక చంద్రబాబు అరెస్ట్ విషయంలో తమ పార్టీ ప్రమేయం ఏమీ లేదని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొంది. అసలు ఈ కలయిక విషయంలో వేరే గేమ్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో సెటిలర్ల ఓట్లపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈసారి సెటిలర్లు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
అలాంటపుడు కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు చూస్తారనడంలో సందేహం లేదు. కానీ కాంగ్రెసే ఈ పరిస్థితిలో ఎక్కువ అడ్వాంటేజ్ పొందుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఈ విషయంలో పెద్దగా ప్రయోజనం పొందట్లేదని అంటున్నారు. అందుక్కారణం బాబు అరెస్ట్ వెనుక ఆ పార్టీ ప్రమేయం కూడా ఉందని సెటిలర్లలో ఉన్న సందేహాలే కారణం. ఇది ఏపీలో కూడా బీజేపీకి ప్రతికూలంగా మారినట్లు భావిస్తున్నారు. అందుకే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా లోకేష్‌ను షా పిలిపించుకున్నారని.. ఈ మీటింగ్‌లో కిషన్ రెడ్డి కూడా ఉండటం తెలంగాణలో సెటిలర్లకు ఒక సంకేతం పంపేందుకే అన్న చర్చ నడుస్తోంది.