కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయిన సంగతి రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ భేటీ సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడే ఉండడం చర్చనీయాంశమైంది. అయితే, అమిత్ షాతో లోకేష్ భేటీని పురంధేశ్వరి ఏర్పాటు చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రచారాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు.
అమిత్ షాను కలిసేందుకు లోకేష్ వెళ్లే సమయానికి పురందేశ్వరి, కిషన్ రెడ్డి ఆల్రెడీ అక్కడున్నారని వివరణనిచ్చారు. అమిత్ షాతో లోకేష్ సమావేశం వెనుక ఎలాంటి ప్రణాళిక లేదని క్లారిటీనిచ్చారు. ఏపీలో పరిస్థితుల గురించి వివరించేందుకే అమిత్ షాతో లోకేష్ భేటీ అయ్యారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
మరోవైపు, జగన్ పై పురందేశ్వరి మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం కక్షా రాజకీయాలపై అమిత్ షాకు లోకేష్ వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలకు బీజేపీ కారణమంటున్న వారు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ పరిణామాల వెనక బీజేపీ ఉంటే లోకేష్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చి ఉండేవారా? అని ప్రశ్నించారు.
ఇక, జగన్ కక్షా రాజకీయాల గురించి అమిత్ షాకు తాను వివరించానని లోకేష్ మీడియాకు తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో పాటు, తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశానని అన్నారు. తమపై ఉన్న కేసుల గురించి హోం మంత్రి అడిగి తెలుసుకున్నారని, రాష్ట్రంలో పరిస్థితులను తాను పరిశీలిస్తున్నట్టు అన్నారని లోకేష్ చెప్పారు.