ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఈ కేసులో లోకేష్ ను నిందితుడిగా చూపలేదని, దాంతో ఆయనను అరెస్టు చేయబోమని కోర్టుకు సీఐడీ అధికారులు తెలియజేశారు. ఒకవేళ ఈ కేసులో లోకేష్ పేరును చేర్చాల్సి వస్తే 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. లోకేష్ ను అరెస్టు చేయబోమంటూ సిఐడి క్లారిటీ ఇవ్వడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
మరోవైపు, అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కొద్ది నెలల క్రితం సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా చంద్రబాబు వెళ్తున్న సందర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, చంద్రబాబు సహా 179 మంది టీడీపీ నేతలపై ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. అంగళ్లు కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చి హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్లపై కేసు పెట్టారు. ఆ తర్వాత ఈ కేసులో కొంతమందికి హైకోర్టులో బెయిల్ వచ్చింది.