అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సిఐడి అధికారులు రెండో రోజూ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి సిట్ కార్యాలయంలో లోకేష్ విచారణ కొనసాగుతోంది. అయితే, తొలి రోజు విచారణ జరుగున్న సందర్భంగా హఠాత్తుగడా దర్యాప్తు అధికారిని మార్చిన వైనం చర్చనీయాంశమైంది. ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డిఎస్పీ విజయభాస్కర్ ను నియమించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర స్పందించారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తప్పుడు మార్గాల్లో చంద్రబాబునో, మరొకరినో ఇరికించాలన్న దురుద్దేశంతోనే దర్యాప్తు అధికారిని మార్చారని ఆయన ఆరోపించారు. అధికారిని ఎందుకు మార్చారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిని బట్టే ఈ కేసు విచారణలో ప్రభుత్వ పాత్ర ఉందని స్పష్టమవుతోందని విమర్శించారు. కోర్టుల్లో విచారణ కీలక దశలో ఉందని చెబుతున్న ప్రభుత్వం…దర్యాప్తు అధికారులను ఎందుకు మారుస్తుందో చెప్పాలని నిలదీశారు. తమ మాట వినడం లేదనే జయరాజ్ ను తప్పించారా? అని ప్రశ్నించారు.
అధికారి మార్పు ద్వారా ప్రభుత్వం పెద్ద కుట్రకు తెరతీసిందని, తద్వారా తాము అనుకున్నది చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. కానీ, ఇలాంటి పనులకు జగన్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని దుయ్యబట్టారు. పరిధి దాటి వ్యవహరించే అధికారులు భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత తీవ్రంగా బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ ఆటలో పావులుగా మారిని అధికారులపై పూర్తిస్థాయిలో టీడీపీ దృష్టి పెడుతుందని వార్నింగ్ ఇచ్చారు.
జగన్ కు తెలిసింది అరాచకం, దోపిడీ, విధ్వంసమేనని… వాటిపై పూర్తి పేటెంట్ హక్కులు ఆయనవేనని విమర్శించారు. చంద్రబాబు అరెస్టు తనకు తెలియదని చెప్పడం జగన్ నటనా కౌశలానికి మచ్చుతునక అని ఎద్దేవా చేశారు. జగన్ నవ్వు పైశాచికత్వానికి పరాకాష్ఠ అని చురకలంటించారు. శాంతిభద్రతలను పర్యవేక్షించే విభాగాలు, విచారణ సంస్థలు సీఎం అధీనంలోనే ఉంటాయని అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై, ఆయన జైల్లో ఉండటంపై మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, వైసీపీ నేతల వ్యాఖ్యలు వారి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు.