చేతిలో అధికారం ఉండాలే కానీ ఏమైనా చేయొచ్చా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏపీ అధికార పక్ష నేతల వైఖరి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొస్తోంది. ప్రోటోకాల్ లాంటి వాటిని పక్కన పెట్టేసి.. తాము ఏమనుకుంటే అదే కరెక్టు అన్నట్లుగా వ్యవహరించే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే గుంటూరు జిల్లా తాడికొండ మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకుంది. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా ఉండవల్లి శ్రీదేవి అన్న విషయం తెలిసిందే.
కొన్ని నెలల క్రితం ఆమె పార్టీకి దూరం కావటం తెలిసిందే. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె పార్టీ కార్యాకలపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తాడికొండ మండల పరిషత్ కార్యాలయంలో అధికారిక సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఫోటో అన్నది కామన్ గా ఉండేది. తాజాగా శ్రీదేవి ఫోటోను తీసేయటం సంచలనంగా మారింది.
మంగళవారం నిర్వమించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవి ఫోటోపైన వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి కత్తెర సురేష్ కుమార్ ఫోటోను ఏర్పాటు చేయటం వివాదంగా మారింది. ఎంత అధికారపక్షమైనా.. పార్టీకి దగ్గరగా ఉండే వారి విషయంలో తమదైన స్టైల్లో ట్రీట్ మెంట్ ఇచ్చే వైసీపీ నేతలు.. తాజాగా ఎమ్మెల్యే విషయంలోనూ అదే తీరును ప్రదర్శించారని చెబుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫోటో ఉండాల్సిన వేళ.. అదేమీ లేకపోవటంతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యుడు ప్రశ్నించారు.
సమావేశానికి సంబంధించిన నోటీసులో ఎమ్మెల్యే పేరు ఉన్నప్పుడు.. సభా మందిరంలో మాత్రం ఆమె ఫోటోకు బదులుగా వైసీపీ ఇంఛార్జి ఫోటోను ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన ఎంపీడీవో జవాబు ఇవ్వకపోటం గమనార్హం. ఈ తరహా ఘటనలు ప్రజల్లో చెడు సంకేతాల్ని తీసుకెళ్లేలా చేస్తాయని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయంటున్నారు.