అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు దాదాపు 50 ప్రశ్నలు అడిగారని, అందులో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేవలం ఒకే ఒక్క ప్రశ్న ఉందని లోకేష్ అన్నారు.
మంత్రి అయిన తర్వాత భూముల లే అవుట్ పై ఇచ్చిన ఓ జీవో గురించి తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ప్రశ్నలు అడగలేదని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను చూపలేదని, తమను అడ్డుకునేందుకు దొంగ ఎఫ్ఐఆర్ లు రూపొందిస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.
రేపు ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ అక్కడిక్కడే నోటీసులు ఇచ్చారని లోకేశ్ వెల్లడించారు. సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారుల ప్రశ్నలకు లోకేశ్ నీళ్లు నమిలారంటూ కొన్ని టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి అని లోకేష్ ను ఓ రిపోర్టర్ అడిగారు. దీంతో, టీవీ9, ఎన్టీవీ, సాక్షి మైక్ లు అందుకుని వీళ్లు తప్ప ఇంకెవరైనా ఆ వార్తను ప్రసారం చేసి ఉంటే చెప్పండి అని తిరిగి ప్రశ్నించారు. విచారణ ముగిశాక దర్యాప్తు అధికారి… థాంక్యూ ఫర్ కో ఆపరేటింగ్ అన్నారని, దానర్థం విచారణకు సహకరించాననే కదా… వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చా అనే కదా అంటూ లోకేశ్ వివరించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మేం చేసిన నేరమా… అందుకే ఇలాంటి కేసుల్లో మమ్మల్ని పిలిచి ఇలా ఒక రోజంతా వేస్ట్ చేస్తారు అని కామెంట్ చేశారు. లేకపోతే యువగళం పాదయాత్ర చేసుకుంటూ ఉండేవాడిని… దొంగ కేసులు పెట్టారు కాబట్టే ఇలా బ్రేక్ వచ్చింది అని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తో తనకు సంబంధం లేదని సీఎం జగన్ అన్నారని, సీఐడీ ముఖ్యమంత్రి కింద పనిచేస్తోందా, లేదా… ఏసీబీ ఎవరికి రిపోర్టు చేస్తుంది? సహజంగానే ముఖ్యమంత్రి గారికి కొంచెం అవగాహన తక్కువ… ఆయను డీజీ వద్ద పాఠాలు చెప్పించుకోమనండి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.