గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన బెస్ట్ ఎంటర్టైనర్లలో ‘జాతిరత్నాలు’ ఒకటి. అప్పటిదాకా చూడని కొత్తరకం కామెడీతో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. తింగరి క్యారెక్టర్లు.. లాజిక్ లెస్ సీన్లు.. నాన్ సింక్ డైలాగులతో ఒక కొత్త రకం కామెడీని ప్రేక్షకులకు పరిచయం చేసిందీ సినిమా. ఐతే ఈ కామెడీ అందరి మీదా వర్కవుట్ కాదు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి మంచి టైమింగ్ ఉన్న, ట్రెండీ నటులు లీడ్ రోల్స్ చేయడం వల్లే ఆ చిత్రం అంత పెద్ద సక్సెస్ అయింది.
ఇదే రకం కామెడీతో ‘ప్రిన్స్’ సినిమా తీసిన దర్శకుడు అనుదీప్ కేవీ.. తొలి సినిమా మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయిన సంగతి తెలిసిందే. అతడికి నవీన్ లాంటి నటుడే కరెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తమైంది. తాజా సమాచారం ఏంటంటే.. నవీన్-అనుదీప్ మళ్లీ కలుస్తున్నారట. వీరి కలయికలో ఓ సినిమా రాబోతోందట. ‘జాతిరత్నాలు’ కాంబో అనగానే దీనికి సీక్వెలో.. లేదంటే ఇలాంటి ఇంకో సినిమానో చేస్తారనుకుంటాం. కానీ ట్విస్టేంటంటే.. వీళ్లిద్దరూ మధ్యలో ఆగిపోయిన ఓ సినిమాను ఈ జోడీ పట్టాలెక్కించబోతోందట. ఆ చిత్రమే.. అనగనగా ఒక రాజు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో రెండేళ్ల కిందట అనౌన్స్ చేసిన సినిమా ఇది. నవీన్ హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మొదలైన సినిమా ఇది.
శ్రీలీలను హీరోయిన్గా అనౌన్స్ చేశారు కూడా. ఒక టీజర్ కూడా వదిలారు సినిమా మొదలైనపుడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత అతీ గతీ లేదు. ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తోనే ‘మ్యాడ్’ అనే వేర సినిమాను మొదలుపెట్టి పూర్తి చేశారు. అది విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటోంది కూడా. కాగా ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని అనుదీప్ టేకప్ చేస్తున్నాడట. కళ్యాణ్ కథకే అతను డిఫరెంట్ స్క్రీన్ ప్లే చేసుకుని సినిమా తీయబోతున్నాడట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.