సీఐడీ విచారణకు సంబంధించి టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సుమారు 6 గంటల పాటు తనను ప్రశ్నించారన్న ఆయన.. అయితే, ఏ కేసుపై అయితే.. తనను విచారణకు పిలిచారో దానికి సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిగారని, మిగిలినవన్నీ.. హెరిటేజ్ సంస్థకు సంబంధించినవేనని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ అధికారులు నారా లోకేష్‌ను ప్రశ్నించారు. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి.. మంగళ వారం విచారణకు పిలిచారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయమే సీఐడీ ఆఫీస్‌కు చేరుకున్న నారా లోకేష్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. అనంతరం.. నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. తనను మొత్తంగా 50 ప్రశ్నలు అడిగారని, అయితే, ఇన్నర్ రింగ్ రోడ్‌కు సంబంధించి కేవలం ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే ఉందని.. మిగిలినవి ఈ కేసుతో సంబంధం లేని ప్రశ్నలే అడిగారని ఆయన చెప్పారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మేం చేసిన నేరమా… అందుకే ఇలాంటి కేసుల్లో మమ్మల్ని పిలిచి ఇలా ఒక రోజంతా వేస్ట్ చేశారు అని కామెంట్ చేశారు.
“ఇది కక్షసాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేని కేసు. ఈ ప్రభుత్వం దొంగ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తోంది. బుధవారం వివిధ పనులతో బిజీగా ఉంటాను.. ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎంత సమయమైనా సరే ఇవాళే అడగాలని.. వాటికి సమాధానం చెబుతానని అడిగా. అయినా కూడా బుధవారం మళ్లీ విచారణకు రావాలన్నారు. అక్కడే నాకు 41 ఏ నోటీసులు ఇచ్చారు. ఈరోజు వచ్చిన విధంగానే బుధవారం కూడా విచారణకు హాజరవుతా’’ అని లోకేష్ అన్నారు.
మంగళవారం నాటి సుదీర్ఘ విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారని నారా లోకేష్ చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తన ముందు పెట్టలేదన్నారు. సీఐడీ అధికారులు 50 ప్రశ్నలు అడిగారని, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో తమ కుటుంబం ఎంత మేరకు లాభపడిందో మాత్రం ఒక్క ప్రశ్న కూడా అడగలేదని చెప్పారు. దీనిని బట్టి ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు ప్రక్రియలో భాగమేనని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, బుధవారం మరోసారి నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరు కానున్నారు.