తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నాయకుల చేరికలతో పార్టీలు హడావుడి చేస్తున్నాయి. కానీ ఓ నాయకుడి చేరిక మాత్రం బీజేపీ తెలంగాణకు తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నాయకుడే చీకోటి ప్రవీణ్. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో చీకోటి బీజేపీలో చేరిపోయారు. డీకే అరుణ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండా పార్టీ రాష్ఱ్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గత కొంత కాలం నుంచి బీజేపీలో చేరేందుకు చీకోటి ప్రవీణ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి వెళ్లి మరీ పార్టీ పెద్దలను ఆయన కలిశారు. కానీ చీకోటి ప్రవీణ్ పై క్యాసినో, హవాలా కేసులు, ఈడీ విచారణ ఉండటంతో పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ బీజేపీ నాయకులు నిరాకరించారని తెలిసింది. ముఖ్యంగా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇందుకు ఒప్పుకోలేదని సమాచారం. చట్ట విరుద్ధంగా క్యాసినోలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు, ఇటీవల బ్యాంకాక్ లో అరెస్టు తదితర కారణాలతో ప్రవీణ్ చేరికను నిరాకరించారు. అలాంటి వ్యక్తి పార్టీలో చేరితే నష్టమని భావించినట్లు తెలిసింది.
కానీ చీకోటి ప్రవీణ్ ఢిల్లీ నుంచి నరుక్కొచ్చారనే చెప్పాలి. బీజేపీలో చేరాలనే పట్టుబట్టిన ఆయన ఢిల్లీ పెద్దలను కలిశారు. గతంలో ఒకసారి బీజేపీలో చేరేందుకు అనుచరులతో ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఈ విషయాన్ని అమిత్ షా ద్రుష్టికి ప్రవీణ్ తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు అమిత్ షా ఆర్డర్ తోనే ఆయన్ని బీజేపీలో చేర్చుకున్నారని చెబుతున్నారు. ఇది కిషన్ రెడ్డికి ఇష్టం లేకపోవడంతో కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సమాచారం. అలాగే హైదరాబాద్ శివారులోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చీకోటి ప్రవీణ్ కు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని తెలిసింది. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రవీణ్ తో పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అమిత్ షా భావించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.