టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు గత నెల రోజులుగా రకరకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అక్రమ కేసులో కక్ష సాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని టిడిపి నేతలు… జగన్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభిమాన సునామీలో జగన్ మోహన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టుల కలయికను ప్రజలు కోరుకుంటున్నారని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.
టీడీపీ, జనసేన మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసిపి యత్నిస్తోందని, విష ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతోందని, అది చూసి ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చిలకలూరిపేటలో ప్రత్తిపాటి ఆధ్వర్యంలో 26వ రోజు టీడీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోకాళ్లపై నిలబడి, అర్ధనగ్నంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి.