ఒక సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. కోట్ల పెట్టుబడి.. వందల మంది కష్టం అందులో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తాము చాలా మంచి సినిమా తీశామన్న నమ్మకంతోనే ఉంటారు మేకింగ్ టైంలో. సినిమా థియేటర్లలోకి వచ్చాక కూడా గొప్పగా ఆడేస్తుందనే ఆశిస్తారు. ఐతే ప్రేక్షకుల దృష్టికోణం వేరుగా ఉంటుంది. సినిమా కోసం ఎవరెంత కష్టపడ్డారు.. ఎంత తపించారు.. ఏ ఉద్దేశంతో సినిమా తీశారు.. ఎంత ఖర్చు పెట్టారు.. ఇవేవీ పట్టించుకోరు. సినిమా చూడాలన్న ఆసక్తి కలిగితే థియేటర్లకు వస్తారు. బాగుంటే ఆదరిస్తారు. ఐతే తాము ఎంతో ప్రేమించి చేసిన సినిమాకు సరైన టాక్, రివ్యూ లు రాకపోతే చిత్ర బృందంలోని వారి బాధ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అలా అని ఆ బాధ అసహనంగా మారి.. రివ్యూయర్ల మీద చూపిస్తేనే కష్టం. ఇలాంటి ఉదంతాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. సినిమాకు టాక్ బాలేనపుడు రివ్యూయర్లను తిట్టడం చాలాసార్లు చూశాం. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు టీం కూడా అదే చేసింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నగోటి ఒక విభిన్న ప్రయత్నమే చేశాడు ఈ చిత్రంతో.
కానీ అది వర్కవుట్ కాలేదు. కొన్ని సీన్లు, పాత్రలు, ఎమోషన్లు బాగున్నా.. ఓవరాల్గా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రివ్యూలన్నీ నెగెటివ్గానే వచ్చాయి. రేటింగ్స్ తక్కువ పడ్డాయి. ఐతే ఈ సినిమా సక్సెస్ మీట్లో సమీక్షకుల మీద దర్శకుడు శ్రీకాంత్ నగోతి తన ఫ్రస్టేషన్ చూపించేశాడు. తన సినిమాకు తక్కువ రేటింగ్స్ వేసిన సమీక్షకులకు తాను 0.5 రేటింగ్ ఇస్తానని అన్నాడు. ఫిలిం మేకింగ్ మీద అవగాహన లేకుండా.. లేజీగా రివ్యూలు రాస్తారంటూ సమీక్షకులపై అతను విమర్శలు గుప్పించాడు. ఐతే సినిమాకు ఆశించిన స్పందన లేదన్న అసహనంలో రివ్యూయర్లను తిట్టడం ఏం న్యాయం అనే ప్రశ్న తలెత్తుతోంది.