సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పథకంపై విమర్శలు గుప్పిస్తూ కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు లోపాలను పరిష్కరించకుండా సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావిడి చేయడం ఏమిటని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు చిన్నపిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి కేసీఆర్ దిగజారారని దుయ్యబట్టారు. ఎన్నో పాఠశాలల్లో వంటగదులు లేక చెట్ల కింద వండుతున్న పరిస్థితి కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు.
ఇలా, సౌకర్యాలు లేకుండా మధ్యాహ్న భోజనం వండడంతో ఆహారం కలుషితమై పిల్లలు అనారోగ్యం బారిన పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆ లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, వాటిపై ఒక్కసారి కూడా కేసీఆర్ సమీక్ష నిర్వహించలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలు, కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
కొద్ది రోజులుగా వారు ధర్నా చేస్తున్నా కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేస్తారని కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే రెండు నెలల్లో ఎవరి మైండ్ బ్లాంక్ అవుతుందో తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. 2014, 2018 మేనిఫెస్టో లోని హామీలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని, కొత్త మేనిఫెస్టో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సెటైర్లు వేశారు.