మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ తన సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అడగగానే ఫ్లవర్ బొకే ఇవ్వకపోవడంతో అసహనానికి గురైన మహమ్మద్ అలీ తన బాడీగార్డ్ చెంప ఛెల్లుమనిపించడం వివాదానికి దారి తీసింది. వదిలేయమని తలసాని ఓ పక్కన వారించడంతో మహమ్మద్ అలీ శాంతించారుగానీ..లేకుంటే తన భద్రతా సిబ్బందిపై విరుచుకుపడేవారని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ వీడియో పై, ఆ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
పోలీసుపై చేయి చేసుకున్న మహమ్మద్ అలీపై కేసీఆర్, డీజీపీలు చర్యలు తీసుకుంటారా అని రాజాసింగ్ ప్రశ్నించారు. విఐపిల రక్షకులుగా కాకుండా సేవకులుగా పోలీసులను పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఒక సాధారణ వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘిస్తే పోలీసులు వేగంగా స్పందించేవారని, ఆగమేఘాలమీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకునే వారని అన్నారు. కానీ, అధికార పార్టీకి చెందిన నేత, హోం మంత్రి అయితే చర్యలు తీసుకోరు అని అన్నారు.