చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అక్టోబర్ 7వ తేదీ రాత్రి 7 గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్, వాహనాల లైట్లు వేసి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాలని లోకేష్ పిలుపునిచ్చారు.
అంతేకాదు, ఆ వీడియో తీసి ‘బాబుతో నేను’ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో షేర్ చేయాలని చెప్పారు. వెలుగులు పంచే చంద్రుడిని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో బంధించారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో చీకటిని సూచిస్తుందని, ఆ చీకటిని తరిమికొట్టేందుకు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చామని అన్నారు. మరోవైపు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బ్రాహ్మణి కూడా పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును చీకటి చేసి ప్రజల కళ్ళు మూసుకోవాలని కొందరు అంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై బ్రాహ్మణి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారని, కానీ ఆ చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలియదని బ్రాహ్మణి అన్నారు. మనమెందుకు చీకట్లో ఉండాలి అందుకే కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, కుప్పం నుంచి ‘మేలుకో తెలుగోడా’ బస్సు యాత్ర చేసే ఆలోచనలో నారా భువనేశ్వరి ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో యాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించారని తెలుస్తోంది. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, బస్సుయాత్ర తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
ఈ రోజు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఇక, ఉండవల్లి నుంచి రాజమండ్రి కి వెళ్లే మార్గంలో లోకేష్ కు టీడీపీ నేతలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అయితే, లోకేష్ వెంట టిడిపి నేతల రాకను పోలీసులు అడ్డుకోవడంతో టిడిపి నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.