టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో మాత్రం చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, ధర్నాలు చేయవద్దంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఆ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడం, ఆంధ్రా సెటిలర్ల ఓట్లు పోతాయని బీఆర్ఎస్ భయపడడం వంటి కారణాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు డ్యామేజీ కంట్రోల్ కు దిగారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును మంత్రి హరీష్ రావు ఖండించగా…తాజాగా అదే బాటలో మంత్రి తలసాని కూడా పయనిస్తున్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన తలసాని…ఆయనను అరెస్టు చేసిన తీరు బాధాకరమని అన్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో మంత్రిగా పని చేశానని, చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధ కలగించిందని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ఒకప్పుడు కేంద్ర రాజకీయాలల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని, అటువంటి చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వ తీరు విచారకరమని అభిప్రాయపడ్డారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు అక్రమ అరెస్ట్, విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేశారని తలసాని కొనియాడారు.