తెలంగాణాలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందా ? అవుననే అంటోంది తెలంగాణా ఇంటెన్షన్స్ అనే సంస్ధ. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడు ప్రధానపార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల పై జనాభిప్రాయం ఎలాగుందనే విషయంపై ప్రతివారం సర్వే చేస్తుంది. ఇందులో భాగంగానే తాజా సర్వేలో బీజేపీ గ్రాఫ్ డౌన్ అయిపోతోందనే విషయం బయటపడింది. ఇదే సమయంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య తేడా కూడా తగ్గిపోతోందట. ఎంత తగ్గినా జనాల మొగ్గు ఇప్పటికీ బీఆర్ఎస్ వైపే ఉందని సర్వేలో తేలింది.
గడచిన వారంలో బీజేపీ గ్రాఫ్ 1 శాతం తగ్గినట్లు తమ సర్వేలో తేలిందని తెంగాణా ఇంటెన్షన్స్ చెప్పింది. కర్నాటక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ తో పోటీగా కమలంపార్టీ జనాల్లో దూసుకుపోతుండేడట. అయితే కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటంతో తెలంగాణాలో ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరగటం మొదలైంది. దానికితోడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ఇరుక్కోవటం అయితే బీఆర్ఎస్-బీజేపీ మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందంలో కవితను అరెస్టు చేయకపోవటం పెద్ద ప్రభావం చూపిందట. బీఆర్ఎస్-బీజేపీలు ఒకటే అని కాంగ్రెస్ నేతలు పదేపదే చేస్తున్న ఆరోపణలను జనాలు నమ్ముతున్నట్లు సర్వేలో తేలింది.
దాని దెబ్బకు బీజేపీలో చేరాలని అనుకున్న నేతల్లో ఎక్కువమంది కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగిపోతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధి ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ హామీలపైన కూడా జనాల్లో ఆసక్తి బాగా పెరుగుతోందని సర్వేలో తేలింది.
ప్రస్తుతం బీజేపీ ఓటుషేర్ కేవలం 9 శాతం మాత్రమే ఉన్నట్లు సర్వేలో అర్ధమవుతోంది. బీఆర్ఎస్ కు 40 శాతం ఓట్ షేరుంటే కాంగ్రెస్ 35 శాతంకు పెరిగింది. ఒకపుడు ఈ రెండుపార్టీల మధ్య ఓట్ల అంతరం దాదాపు 15 శాతముండేది. అలాంటిది ఇపుడు 5 శాతంకు చేరుకుంది. అంటే ముందుముందు అంతరం మరింతగా తగ్గే అవకాశం ఉందని అర్ధమవుతోంది. కాంగ్రెస్ టికెట్ల ప్రకటన తర్వాత ఏమి జరుగుతుందో చూడాలి. ఇదే సమయంలో తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ వస్తుందనే అభిప్రాయాలు కూడా తగ్గిపోతున్నది. రెండు నెలల క్రితం హంగ్ వస్తుందని 14 శాతం అభిప్రాయపడితే ఇపుడది 6 శాతంకు తగ్గింది.